Andhrapradesh
శాస్త్రీయ విద్యా విద్యావిధానానికై పోరాటాలకు సిద్ధం కావాలి.
ఏఐఎస్ఎఫ్ జిల్లా ఉపాధ్యక్షులు ఎస్.శరత్ కుమార్.
దేశంలో శాస్త్రీయ విద్యావిధానానికై పోరాటాలు నిర్వహించడానికి విద్యార్థులందరూ సన్నద్ధం కావాలని ఏఐఎస్ఎఫ్ జిల్లా ఉపాధ్యక్షులు ఎస్.శరత్ కుమార్ పిలుపునిచ్చారు. శుక్రవారం స్థానిక ప్రభుత్వ జూనియర్ కళాశాలలో ఏఐఎస్ఎఫ్ సభ్యత్వ నమోదు కార్యక్రమం చేపట్టారు.
అనంతరం విద్యార్థులను ఉద్దేశించి ఆయన మాట్లాడుతూ కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం రెండోసారి అధికారంలోకి వచ్చాక, విద్యావ్యవస్థను మరింత చీకట్లోకి నెట్టిందని ఆగ్రహం వ్యక్తం చేశారు. శాస్త్రీయత లేని చదువులు ప్రవేశపెట్టి, విద్యార్థుల యొక్క మెదళ్ళకు మరింత బూజును పట్టించే విధంగా తయారు చేస్తుందని అన్నారు.
నూతన జాతీయ విద్యా విధానం 2020 పేరుతో విద్యా రంగంలో సమూల మార్పులు తీసుకోస్తున్నామని చెప్పి, జ్యోతిష్యాలు,పురాణ గాథలు, చిలక పంచాంగాలకు సంబంధించిన కోర్సులను ప్రవేశపెట్టి, విద్యా కాషాయకరణ చేస్తుందని అన్నారు.
అంతేకాకుండా భారతదేశ స్వాతంత్ర్య సంగ్రామంలో పాల్గొని,పోరాడి ప్రాణాల అర్పించిన భగత్ సింగ్ లాంటి పోరాట యోధులు జీవిత చరిత్రలను పాఠ్యాంశాలుగా ఉన్న వాటిని తొలగించి, పరాయి పాలకులకు తొత్తుగా వ్యవహరించిన వారి యొక్క జీవితాన్ని పాఠ్యాంశాలుగా చేర్చి, చరిత్రను వక్రీకరిస్తుందని అన్నారు.
దేశంలో విదేశీ యూనివర్సిటీలను స్వాగతించి, స్వదేశీ యూనివర్సిటీ ల మనుగడను లేకుండా చేస్తుందని అన్నారు. ఆంధ్రప్రదేశ్ లో నూతన జాతీయ విద్యా సంస్థలను ఏర్పాటు చేసి, విద్యాభివృద్ధికి విద్యాసంస్థల అభివృద్ధికి అధిక నిధులు కేటాయిస్తామని అనేక మాటలు చెప్పి, తీరా ఆంధ్ర రాష్ట్ర విద్యార్థులను నట్టేట ముంచేశారని అన్నారు.
కేంద్రంలో నరేంద్ర మోడీ తానా అంటే రాష్ట్రంలో జగన్ మోహన్ రెడ్డి తందానా అంటున్నారని విమర్శించారు. బిజెపి పాలిత రాష్ట్రాల్లోనే నూతన జాతీయ విద్యా విధానాన్ని వ్యతిరేకిస్తే, కేవలం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోనే అన్ని రాష్ట్రాల కంటే ముందుగా నూతన విద్యా విధానాన్ని అమలు చేశారని అన్నారు.
కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అవలంబిస్తున్న విద్యా వ్యతిరేక విధానాలను తిప్పి కొట్టేందుకు పోరాటాలకు సిద్ధం కావాలని ఆయన పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో ఏఐఎస్ఎఫ్ జిల్లా కార్యవర్గ సభ్యులు రంగన్న, మండల అధ్యక్షులు మధు, మండల నాయకులు మల్లి,నరేష్, సింహాద్రి సురేంద్ర తదితరులు పాల్గొన్నారు.