Andhrapradesh
సాంప్రదాయాన్ని పాటిస్తూ ,ఆచార వ్యవహారాలు కాపాడుకుందాం…
సాంప్రదాయాన్ని పాటిస్తూ ,ఆచార వ్యవహారాలు కాపాడుకుందాం…
బన్ని ఉత్సవాన్ని ప్రశాంతంగా సంతోషంగా జరుపుకుందాం…
ఏ దేవుడు ఏ మతము రక్తపాతాన్ని కోరదు…
జిల్లా కలెక్టర్ డాక్టర్ జి. సృజన…
కర్నూలు / ఆలూరు అక్టోబర్ 16 :- దేవరగట్టు మాళ మల్లేశ్వర స్వామి సన్నిధిలో బన్ని ఉత్సవాలను పురస్కరించుకొని ఏర్పాటు చేసిన సమన్వయ కమిటీ సమావేశంలో జిల్లా కలెక్టర్ డాక్టర్ జి. సృజన మాట్లాడుతూ… ఏ దేవుడు ఏ మతము రక్తపాతాన్ని కోరుకోదని , సాంప్రదాయాన్ని , ఆచార వ్యవహారాలు పాటిస్తూ పండుగ ప్రశాంతంగా ఆనందంగా జరుపుకోవాలని సమావేశానికి హాజరైన ఉత్సవ కమిటీ సభ్యులను , గ్రామస్తులను ,అధికారులను కోరారు.
ఈనెల దసరా ఉత్సవాల సందర్భంగా 24వ తారీఖు రాత్రి జరుగు మాళ మల్లేశ్వర స్వామి కళ్యాణము సందర్భంగా జరుగు బన్ని ఉత్సవానికి రాష్ట్ర మరియు ఇతర రాష్ట్రాల నుండి కూడా దాదాపు లక్ష యాభై వేల మంది భక్తులు హాజరయ్యే అవకాశం ఉన్నందున అందుకు కావలసిన ఏర్పాట్లను జిల్లా కలెక్టర్ డాక్టర్ జి. సృజన మాళ మల్లేశ్వర స్వామి సన్నిధిలో సమీక్షించారు. ఈ సందర్భంగా దేవస్థాన కమిటీ సభ్యులను, అధికారులను మరియు గ్రామస్తులను ఉద్దేశించి మాట్లాడుతూ ఆలయ సాంప్రదాయాలు , ఆచార వ్యవహారాలు కాపాడుకుంటూ క్రమశిక్షణతో రాజ్యాంగాన్ని గౌరవిస్తూ చట్టాన్ని గౌరవిస్తూ పండుగలు జరుపుకోవాలని ఈ సందర్భంగా ఎవరు కూడా ఇబ్బంది పడకూడదని గాయాలు పాలు కాకూడదని కోరుకుంటున్నానని తెలిపారు. ఏ దేవుడు ఏ మతము రక్తపాతము కోరుకోదని తెలిపారు. పూర్వకాలంలో నడక ద్వారా మాళ మల్లేశ్వర స్వామిని దర్శించుకోవడానికి రాత్రివేళ భక్తులు వచ్చేవారు .ఆ సమయంలో జంతువులు, విష సర్పాల భారి నుండి కాపాడుకోవటానికి గాను కర్రలను వాటికి శబ్దం చేసే గజ్జలు , రింగులు వాడుకోవడం ఆనవాయితీగా ఉన్నది. ఆ కర్రలతో రాత్రి వేళలో తమను తాను రక్షించుకోవడానికి మరియు ఎత్తైన కొండలు అధిరోహించడానికి వాడేవారు . ఇప్పుడు ఆ కర్రలను బన్ని ఉత్సవం సందర్భంగా ఇతరులను గాయపరచడానికి వాడటం సరికాదని తెలిపారు. దేవుని పేరుతో ఏ సాంప్రదాయము హింసను కోరుకోదని కావున కర్రలు వినియోగించరాదని హితవు పలికారు. భక్తులకు ఎటువంటి ఇబ్బందులు లేకుండా అన్ని వసతులు సమకూరుస్తామని ఉత్సవాన్ని ప్రశాంతంగా సంతోషంగా జరుపుకోవాలని విజ్ఞప్తి చేశారు.
ఈ సందర్భంగా జిల్లా ఎస్పీ కృష్ణ కాంత్ మాట్లాడుతూ ప్రతి ఒక్కరూ సంస్కృతి సంప్రదాయాలు గౌరవించాలని అదే సమయంలో ఇతరులను బాధపెట్టే విధంగా ప్రవర్తించరాదని తెలిపారు . ఈసారి బన్ని ఉత్సవాలకు దాదాపు 100 రాత్రి వీడియో కెమెరాలతో పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేస్తున్నామని , దాదాపు 5 అంబులెన్సులు ఏర్పాటు చేస్తున్నామని , అగ్నిమాపక యంత్రాలు , ప్రాథమిక చికిత్స కేంద్రాలు ఏర్పాటు చేస్తున్నామని వీటిని సద్వినియోగం చేసుకోవాల్సిందిగా కోరారు. ఇప్పటికే సారా నియంత్రణ మరియు కర్రల స్వాధీనం చేసుకోవడం మొదలుపెట్టామని తెలిపారు . ప్రతి ఒక్కరి రక్షణ కొరకు అన్ని చర్యలు తీసుకుంటున్నామని ఈ విషయంలో ప్రజల సహాయ సహకారాలు కోరుకుంటున్నామని మీ సహకారంతో బన్ని ఉత్సవం ప్రశాంతంగా సంతోషంగా సాంప్రదాయ బద్ధకంగా జరుపుకుందామని కోరారు.
ఆదోని సబ్ కలెక్టర్ అభిషేక్ కుమార్ బన్ని ఉత్సవాల ఏర్పాట్ల సందర్భంగా ప్రసంగిస్తూ జిల్లా కలెక్టర్ ఆదేశాల మేరకు అన్ని వసతులు , ఏర్పాట్లు చేస్తున్నామని తెలిపారు .ఈ ప్రాంతం మొత్తం ప్రకాశవంతంగా ఉండడానికి ఎత్తైన లైట్లు , జనరేటర్ ఏర్పాట్లు చేస్తున్నామని , త్రాగునీరు , ఆరోగ్య శిబిరాలు ఏర్పాటు చేస్తున్నామని తెలిపారు . పరిసర గ్రామాల్లో ఈ ఉత్సవాల్లో మద్యాన్ని వాడకుండా , కర్రలు తీసుకొని రాకుండా సాంప్రదాయబద్ధంగా క్రమశిక్షణతో ఉత్సవాన్ని జరుపుకోవడానికి గాను అవగాహన కార్యక్రమాలు ఏర్పాటు చేస్తున్నామని తెలిపారు . రాత్రిపూట స్పష్టంగా అగుపించే కెమెరాలు ఏర్పాటు చేయడం ద్వారా అసాంఘిక శక్తులు , క్రమశిక్షణను ఉల్లంఘించిన వారిపై చర్యలు తీసుకోవడానికి వెనుకాడేది లేదని తెలిపారు.
కర్నూలు జిల్లా దేవాదాయ శాఖ సహాయ కమిషనర్ యం. రామాంజనేయులు మాట్లాడుతూ ఈ ప్రాంత ప్రజలు ఉత్సవాన్ని సంప్రదాయబద్ధంగా , వివాదరహితంగా జరుపుకోవడానికి సహకరించాలని , దేవాదాయశాఖ తరఫున అన్ని విభాగాలతో సహాయ సహకారాలు తీసుకుంటూ భక్తులకు ఎటువంటి పరిస్థితుల్లోనూ అసౌకర్యం కలుగకుండా చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు . అందుకు భక్తులు కూడా మా సేవలు వినియోగించుకోవాలని ఉత్సవాన్ని ప్రశాంతంగా జరుపుకోవాలని కోరారు.
ఈ సందర్భంగా ఆలయ పూజారి మనోహర్ స్వామి క్షేత్రం యొక్క మహత్యం ఆలయ ప్రాశస్త్యం తెలిపారు. మనోహర్ స్వామి మాట్లాడుతూ మనకున్న లెక్కల ప్రకారం 500 సంవత్సరాల క్రితం నుండి ఈ ఉత్సవాలు ఘనంగా జరుపుకుంటున్నామని అప్పటినుండి ఇప్పటివరకు సాంప్రదాయంగా జరుపుకుంటున్నామని , ఇప్పుడు కూడా ప్రజలు దేవస్థానానికి , క్రమశిక్షణతో ఉండి ప్రభుత్వానికి సహకరించి ఉత్సవాలను జయప్రదం చేయాలని విజ్ఞప్తి చేశారు. బ్రిటిష్ వారు కూడా ఈ ఉత్సవాలను పరిశీలించి మెచ్చుకునే వారని తెలియజేశారు.
ట్రస్ట్ బోర్డు మెంబర్ వీరనాగ మాట్లాడుతూ ఈ ప్రాంతానికి వచ్చే మార్గాన్ని సిసి రోడ్డు గా మార్చడానికి చర్యలు తీసుకోవాలని , ఈ ప్రాంతంలోని రోడ్లు చాలా ఇరుకుగా ఉన్నాయని వాటి విస్తరణకు కూడా చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్ ను కోరారు.