Andhrapradesh
టిడిపి అధికారంలోకి రావడం ఖాయం: కోట్ల జయ సూర్య ప్రకాష్ రెడ్డి.
జిల్లాను కరువు జిల్లాగా ప్రకటించాలి.
నేను పోటి చేసే స్థానాన్ని అధిష్టానం నిర్ణయిస్తుంది.
టిడిపి నేత సుధాకర్ శెట్టిని పరామర్శించిన కోట్ల.
తెలుగుదేశం పార్టీ అధికారంలోకి రావడం ఖాయమని అధికారం చేపట్టిన వెంటనే పరిశ్రమలు తీసుకువచ్చి యువతకు ఉద్యోగ,ఉపాధి అవకాశాలు కల్పించడమే కాకుండా జిల్లాలో పెండింగ్ ప్రాజెక్టులైన వేదవతి, గుండ్రేవుల, ఆర్డీఎస్ కుడికాలు వ, ఎల్.ఎల్.సి. అండర్ గ్రౌండ్ పైపులైన్ పనులను పూర్తిచేసి రైతాంగాన్ని ఆదుకుంటామని మాజీ కేంద్ర మంత్రి , తెలుగుదేశం పార్టీ జాతీయ ఉపాధ్యక్షులు కోట్ల జయ సూర్య ప్రకాష్ రెడ్డి పేర్కొన్నారు.
మంగళవారం సర్జరీ చేయించుకున్న స్థానిక టిడిపి నేత ఆరవీటి సుధాకర్ శెట్టి ని వారి ఇంటికి వెళ్లి పరామర్శించి ఆరోగ్యం గురించి అడిగి తెలుసుకున్నారు. అనంతరం కోట్ల క్యాంపు కార్యాలయము నందు ఏర్పాటుచేసిన పాత్రికేయుల సమావేశంలో పాల్గొని మాట్లాడారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జిల్లాలో త్రాగునీటి కూడా కటకటగా మారే పరిస్థితి నెలకొందన్నారు. తుంగభద్ర డ్యామ్ లో..28 టీఎంసీలు నీరు, శ్రీశైలం డ్యాం లో 60 టీఎంసీలు నీరు మాత్రమే నిల్వ ఉన్నాయని అవి 16 రోజులకు మాత్రమే సరిపోతుందన్నారు.
జగన్ సర్కారు ఉమ్మడి కర్నూలు జిల్లాలో కేవలం కొన్ని మండలాలను మాత్రమే కరువు మండలాలుగా ప్రకటించిందని అలా కాకుండా జిల్లానే కరువు జిల్లాగా ప్రకటించి రైతన్నలను ఆదుకునే దిశగా పంటలను బట్టి ఎకరాకు 40 వేల నుండి 50 వేల వరకు నష్టపరిహారం అందించి ఆదుకోవాలని డిమాండ్ చేశారు.
కరువుతో పేదలు,రైతులు పల్లెలను ఖాళీ చేసి ఇతర ప్రాంతాలకు వలసలు వెళుతుంటే జిల్లాకు చెందిన మంత్రులు,ఎమ్మెల్యేలు కనీసం గ్రామాలను తొంగి చూసి ధైర్యం చెప్పిన పాపాన పోలేదని ప్రజాప్రతినిధులపై మండిపడ్డారు. ముఖ్యమంత్రి వై.ఎస్. జగన్ ఎమ్మిగనూరులో నిర్వహించిన సభ అట్టర్ ప్లాప్ అయ్యిందని తెలిపారు.
ప్రజలను బెదిరించి, ప్రలోభాలకు గురిచేసి జిల్లా వ్యాప్తంగా ప్రైవేటు స్కూల్స్ బస్సులు, ఆర్టీసీ బస్సుల ద్వారా జనాన్ని తరలించారని దమ్ము ,ధైర్యం ఉంటే ప్రజలు స్వచ్ఛందంగా వచ్చేలా సభలు నిర్వహించాలని, టిడిపి దీనికి సిద్ధంగా ఉందని సవాల్ విసిరారు. పోలీసు బలగాలతో, పరదాల చాటున ముఖ్యమంత్రి ఎమ్మిగనూరుకు పర్యటించారని, ప్రజలలోకి స్వేచ్ఛకు వచ్చే దమ్ము ఎక్కడిదన్నారు. ఎమ్మిగనూరు అభివృద్ధికి ప్రకటించింది కూడా ఏమీ లేదన్నారు. జగన్ హయంలో ఎమ్మిగనూరును ఏమి అభివృద్ధి చేశారో చెప్పాలని కోరారు. తమ పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడుపై తప్పుడు కేసులు బనాయించి, అక్రమంగా అరెస్టు చేసి జైల్లో నిర్బంధించడంతో దేశంలోనే కాకుండా ప్రపంచవ్యాప్తంగా చంద్రబాబుకు మద్దతు లభించిందన్నారు.
దీంతో చంద్రబాబు విజన్ ఉన్న నాయకుడని, జగన్ రీజన్ నాయకుడని ప్రజలకు తెలిసిపోయిందన్నారు. జగన్ సర్కారులో జరిగిన అవినీతిని, ఇసుక దందా, జే బ్రాండ్ మద్యం అమ్మకాలు, మర్డర్ల పైన విచారణ జరిపించి చర్యలు తీసుకుంటామన్నారు.
వివేకా హత్య కేసులో ఏ 8 అయిన కడప ఎంపీ వై.ఎస్. అవినాష్ రెడ్డిని సిబిఐ అరెస్టుకు యత్నిస్తే..! పోలీసు బలగాలతో అడ్డుకోవడం, చంద్రబాబును మాత్రం అరెస్టు చేయడం చూస్తుంటే జగన్ చట్టాలను తన చుట్టాలుగా మార్చుకున్నారని ఆరోపించారు. న్యాయవ్యవస్థపై తమకు గౌరవం ఉందన్నారు. జగన్ రద్దు చేసిన పథకాలన్నీ అమలు చేస్తామన్నారు. ఎస్సీ, ఎస్టీ,బీసీ,మైనార్టీ కార్పొరేషన్లకు నిధులు కేటాయించి పునరుద్ధరించి ఆయా సామాజిక వర్గాలకు ఉపాధి కల్పించి తీరుతామన్నారు.
ఎమ్మిగనూరు నియోజకవర్గము నుండి ఎమ్మెల్యేగా పోటీ చేస్తారా అని విలేకరులు అడిగిన ప్రశ్నకు తను పోటీ చేసే స్థానాన్ని (ఎంపీగా, ఎమ్మెల్యేగా) చంద్రబాబు, అధిష్టానం నిర్ణయిస్తుంది అని మాజీ కేంద్రమంత్రి కోట్ల జయ సూర్య ప్రకాష్ రెడ్డి సమాధానమిచ్చారు.
ఎమ్మిగనూరు నియోజకవర్గానికి మొదటి ఎమ్మెల్యేగా తన తండ్రి దివంగత మాజీ ముఖ్యమంత్రి కోట్ల విజయభాస్కర్ రెడ్డి ప్రాతినిధ్యం వహించారని ఈ సందర్భంగా గుర్తు చేశారు. కార్యకర్తలకు అండగా ఉంటానని భరోసానిచ్చారు.
ఈ కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ నాయకులు ఆరవీటి సుధాకర్ శెట్టి, కోడుమూరు మాజీ సర్పంచ్ సి.బి.లత, మాజీ సింగిల్ విండో చైర్మన్ మల్కాపురం నాగిరెడ్డి, కదిరికోట ఆదెన్న, మాజీ జిల్లా వక్ఫ్ బోర్డు డైరెక్టర్ జి.అల్తాఫ్, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర సగర (ఉప్పర) ఫెడరేషన్ మాజీ డైరెక్టర్ ఉప్పర ఆంజనేయులు, కర్నూల్ పార్లమెంట్ నియోజకవర్గం తెలుగుదేశం పార్టీ కురువ సాధికారిక కమిటీ సభ్యులు అడ్వకేట్ కే.టి. మల్లికార్జున, మాజీ ఆత్మ చైర్మన్ కందనాతి శ్రీనివాసులు, నందవరం మండలం టిడిపి నాయకులు ముగతి వీరారెడ్డి, ఎమ్మిగనూరు మునిసిపల్ మాజీ కౌన్సిలర్లు మాచాని శివ కుమార్, హరిప్రసాద్ రెడ్డి, గోనెగండ్ల మండలం టిడిపి నాయకులు టి. ప్రభాకర్ నాయుడు, యూనుస్, గంజహళ్లి లక్ష్మన్న, తెలుగు మహిళా నాయకురాలు గోకారమ్మలతో పాటు వివిధ మండలాలు నాయకులు కార్యకర్తలు, అభిమానులు పాల్గొన్నారు.