Andhrapradesh

నవంబర్ 8 న జరిగే విద్యాసంస్థల బంద్ ను జయప్రదం చేయండి.

Published

on

112 Views

ఏఐఎస్ఎఫ్ జిల్లా ఉపాధ్యక్షులు ఎస్.శరత్ కుమార్.

విశాఖ ఉక్కు పరిశ్రమ ప్రైవేటీకరణను ఉపసంహా రించుకోవాలని, కడప ఉక్కు పరిశ్రమను ఏర్పాటు చేయాలని డిమాండ్ చేస్తూ వామపక్ష విద్యార్థి, యువజన సంఘాల ఆధ్వర్యంలో నవంబర్ 8 వ తేదీన జరిగే కేజీ నుండి పీజీ వరకు విద్యాసంస్థల బంద్ ను జయప్రదం చేయాలని ఏఐఎస్ఎఫ్ జిల్లా ఉపాధ్యక్షులు ఎస్. శరత్ కుమార్ పిలుపునిచ్చారు. శనివారం ప్రభుత్వ జూనియర్ కళాశాలలో గోడ పత్రికలను విడుదల చేశారు.

అనంతరం వారు మాట్లాడుతూ కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ ప్రభుత్వం ఉక్కు పరిశ్రమను ప్రైవేటీకరణకు పూనుకుంటుందని ఆగ్రహం వ్యక్తం చేశారు. 32 మంది ఆంధ్రుల ప్రాణ త్యాగాలతో నిర్మించుకున్న విశాఖ ఉక్కు పరిశ్రమను కారుచౌకగా కార్పొరేట్లకు అమ్మేస్తూ, ఆంధ్ర రాష్ట్ర ప్రజలను మోసం చేస్తున్నారని అన్నారు.

లాభాల్లో నడుస్తున్న పరిశ్రమను నష్టాల్లో చూపిస్తూ, ప్రైవేట్ పరం చేయడం సమంజసం కాదన్నారు.రాష్ట్రంలో అధికారంలో ఉన్న వైసీపీ ప్రభుత్వం రాష్ట్రంలో నూతన పరిశ్రమలు ఏర్పాటు చేసి యువత కు ఉపాధి కల్పించడంలో ఘోరంగా విఫలం చెందారని అన్నారు.

రాష్ట్ర ప్రభుత్వం రాష్ట్రంలో ఉన్న ప్రభుత్వ రంగ సంస్థలను కాపాడుకోవడంలో బాధ్యతారహితంగా వ్యవహరిస్తుందని అన్నారు. ఈ రాష్ట్రంలో నిరుద్యోగుల, ప్రజల పట్ల చిత్తశుద్ధి ఉంటే రాష్ట్ర ప్రభుత్వం బంద్ కు సంపూర్ణ మద్దతు ప్రకటించి, మీ వైఖరి ని తెలియజేయాలని అన్నారు. రాష్ట్రంలో ఉండే అన్ని రాజకీయ పార్టీలను కలుపుకొని అఖిలపక్ష సమావేశాలు ఏర్పాటు చేసి, కేంద్ర ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకురావాలని ప్రభుత్వాన్ని కోరారు. అదేవిధంగా ఎన్నో సంవత్సరంల పాటు శంకుస్థాపనలు చేస్తున్న కడప ఉక్కు పరిశ్రమ నిర్మించకపోవడం దారుణమన్నారు.

ఇదిగో పరిశ్రమ అదిగో పరిశ్రమని అంటూ ప్రజలను మోసం చేస్తున్నారని అన్నారు. ఉక్కు పరిశ్రమ ఏర్పాటు అయితే రాష్ట్రంలో ఉన్న నిరుద్యోగులకు ఉద్యోగ ఉపాధి అవకాశాలు లభిస్తాయని అన్నారు. కేంద్ర ప్రభుత్వం విభజన హామీలు ఏ ఒక్కటి కూడా అమలు చేయకుండా ఆంధ్ర రాష్ట్రాన్ని మరింత చీకటిలోకి నెడుతోందని ఆవేదన వ్యక్తం చేశారు.

నవంబర్ 8వ తేదీన జరిగే బంద్ లో అన్నీ రంగాల ప్రజలు, యువకులు, విద్యార్థులు ప్రత్యక్షంగా పాల్గోని,జయప్రదం చేయాలని ఆయన పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో ఏఐఎస్ఎఫ్ జిల్లా కార్యవర్గ సభ్యులు రంగన్న, మండల అధ్యక్ష, కార్యదర్శులు మధు, భాస్కర్,నాయకులు సింహాద్రి, సురేంద్ర,కళాశాల విద్యార్థినీ, విద్యార్థులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Trending

Exit mobile version