Andhrapradesh
మండల సమగ్ర అభివృద్ధికై తక్షణ చర్యలు చేపట్టండి.
విద్య వైద్యం ఉపాధి అవకాశాలపై దృష్టి సారించేలా అధికారులకు ఆదేశాలు ఇవ్వండి.
జగనన్నకు చెబుదాం కార్యక్రమంలో భాగంగా జిల్లా జాయింట్ కలెక్టర్ నారపురెడ్డి మౌర్య గారికి సిపిఐ ప్రతినిధి బృందం వినతిపత్రం.
కర్నూలు జిల్లాలో అత్యంత వెనుకబడిన మండలం గా ఉన్న దేవనకొండ మండల సమగ్ర అభివృద్ధి పట్ల తక్షణ చర్యలు చేపట్టాలని సిపిఐ మండల ప్రధాన కార్యదర్శి ఎం. నరసారావు తెలిపారు. ఈ సందర్భంగా శుక్రవారం మండల కేంద్రమైన దేవనకొండ లో చేపట్టిన జగనన్నకు చెబుదాం స్పందన కార్యక్రమం లో భాగంగా జిల్లా జాయింట్ కలెక్టర్ నారపురెడ్డి మౌర్య గారికి మండల సిపిఐ ప్రతినిధి బృందం వినతి పత్రం అందించి మండలంలోని పలు సమస్యలను జాయింట్ కలెక్టర్ దృష్టికి తీసుకువచ్చారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. మండలంలో ప్రధాన సమస్యలు విద్యా, వైద్యం, ఉపాధి తదితర అంశాలపై ప్రత్యేక శ్రద్ధ చూపాలన్నారు. పాలకులు మారిన ప్రజల తలరాతలు నేటికీ మారడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. చెంతనే హంద్రీ-నీవా నీరు ఉన్న చివరి ఆయకట్టు దాకా రైతాంగానికి సాగు కోసం నీరు అందించడానికి పిల్ల కాలువ నిర్మాణం నేటికి చేపట్టకపోవడం శోచనీయమన్నారు. ప్రస్తుత కరువు నెలకొన్న పరిస్థితుల దృష్ట్యా కరువు మండలంగా ప్రకటించినప్పటికీ రైతాంగాన్ని ఆదుకునేందుకు పటిష్టమైన కార్యాచరణ రూపొందించాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నారు. పనులు లేక వలసలు వెళ్లే పరిస్థితి దాపురించిందన్నారు. వలసల నివారణకు ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేస్తూ తగు చర్యలు చేపట్టాలన్నారు. అలాగే మండల కేంద్రంలో గల ప్రభుత్వ వైద్యశాలను 50 పడకల వైద్యశాలగా మార్పు చేసి రెగ్యులర్గా ఇద్దరు డాక్టర్లను, ఒక మహిళ డాక్టర్ను నియమించి, కుటుంబ నియంత్రణ ఆపరేషన్లు దేవనకొండ పిహెచ్సి లో జరిగే విధంగా ఆదేశాలు ఇవ్వాలన్నారు. అదేవిధంగా దేవనకొండ మండలం అన్నీ ఉన్నా అల్లుని నోట్లో శని మాదిరిగా దాపురించిందన్నారు. ఎందుకంటే ప్రభుత్వ స్థలాలు వేల ఎకరాలు ఉన్నా కూడా ప్రభుత్వ బాలుర వసతి గృహానికి మరియు మోడల్ స్కూల్ కు,యువతకు క్రీడా మైదానం కొరకు ప్రభుత్వ స్థలాలు కేటాయించలేక పోవడంతో మోడల్ స్కూల్ ఏర్పాటు కూడా వెనుకబడిపోవడానికి కారణంగా ఉందన్నారు. కావున ఎలక్షన్ల సమయంలోనే విద్యార్థులు యువకులు, ప్రజలు గుర్తుకు వచ్చే పాలకులకు పేద, బడుగు, బలహీన వర్గాలు ఎదుర్కొంటున్న సమస్యల పరిష్కారం పట్ల చిత్తశుద్ధితో పనిచేసేలా తగు చర్యలు చేపట్టాలన్నారు. కావున మండల ప్రజల సమస్యల పరిష్కారం పట్ల తక్షణ చర్యలు చేపట్టగలరని వారు జిల్లా జాయింట్ కలెక్టర్ గారిని కోరడం జరిగింది. ఈ సందర్భంగా తమరు మా దృష్టికి తీసుకు వచ్చిన పలు సమస్యలు పరిష్కరించేందుకు చర్యలు తీసుకుంటామని హామీ ఇవ్వడం జరిగిందన్నారు. ఈ కార్యక్రమంలో సిపిఐ మండల సీనియర్ నాయకులు గుడిమరాళ్ళ తిమ్మప్ప, భక్తతుకారం, నరసింహులు, సుల్తాన్, మహేశ్వరప్ప,హనుమంతు, శ్రీనివాసులు, రామాంజనేయులు, విద్యార్థి, యువజన సంఘాల నాయకులు తదితరులు పాల్గొన్నారు.