Crime News

ప్రవల్లిక కేసు .. చిక్కడపల్లి ఇన్స్‌పెక్టర్‌పై సస్పెన్షన్ వేటుపడింది.

Published

on

301 Views

గ్రూప్ 2 పోటీ పరీక్షలకు ప్రిపేర్ అవుతోన్న విద్యార్ధిని ప్రవళిక విషయంలో చిక్కడపల్లి ఇన్స్‌పెక్టర్ నరేష్‌పై వేటు వేసింది తెలంగాణ ప్రభుత్వం . ఆయనను విధుల నుంచి సస్పెండ్ చేస్తూ ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. కాగా.. హైదరాబాద్ సెంట్రల్ జోన్ డీసీపీ వెంకటేశ్వరరావు నిన్న మీడియాతో మాట్లాడుతూ.. ప్రేమ వ్యవహారమే ప్రవళిక ఆత్మహత్యకు కారణమని ప్రాథమికంగా నిర్దారణకు వచ్చామని చెప్పారు. ఆమె ఫోన్ చాటింగ్‌లో కొంత సమాచారం లభించిందని తెలిపారు. ప్రవళిక ప్రేమ వ్యవహారం ఆమె తల్లిదండ్రులకు కూడా తెలుసునని చెప్పారు. ప్రేమించిన వ్యక్తి మోసం చేసి మరో అమ్మాయితో ఎంగేజ్‌మెంట్‌ చేసుకుంటున్నాడనే ప్రవళిక మనస్తాపంతో ఆత్మహత్య చేసుకుందని నిర్దారించామని తెలిపారు.

చిక్కడపల్లి పోలీసు స్టేషన్‌కు రాత్రి 8.40 గంటల ప్రాంతంలో ఫోన్ కాల్ వచ్చిందని చెప్పారు. దీంతో పోలీసులు వెంటనే అక్కడికి వెళ్లడం జరిగిందని తెలిపారు. ప్రవళిక హాస్టల్‌లో ఉన్నవారి నుంచి వివరాలు సేకరించడం జరిగిందని చెప్పారు. చిక్కడపల్లి, అశోక్‌ నగర్ ప్రాంతాల్లోని పెద్ద ఎత్తున విద్యార్థులు వేర్వేరు వెర్షన్లతో ధర్నాకు దిగడం జరిగిందని తెలిపారు. కొంతసేపటికే స్థానిక లీడర్లు కూడా అక్కడికి వచ్చారని చెప్పారు. అయితే వారిని తొలగించి రాత్రి 1.30 గంటల ప్రాంతంలో ప్రవళిక మృతదేహాన్ని గాంధీ ఆస్పత్రికి తరలించామని తెలిపారు. పోస్టుమార్టం అనంతరం ఉదయం ప్రవళిక మృతదేహాన్ని ఆమె తల్లిదండ్రులకు అప్పగించడం జరిగిందని తెలిపారు.

అయితే అమ్మాయి గదిలో సూసైడ్ నోట్, మొబైల్ ఫోన్, లవ్ సింబల్ ఉన్న మరో లేఖ లభించిందని తెలిపారు. మొబైల్ ఫోన్‌కు లాక్‌ లేదని.. అందులో కొంత చాటింగ్ కనిపించిందని చెప్పారు. ఈ మూడింటిని ఫోరెన్సిక్ ల్యాబ్‌‌కు పంపించినట్టుగా తెలిపారు. డేటా రీట్రైవ్ చేసిన తర్వాత మరింతగా సమాచారం తెలుస్తోందని అన్నారు. ఆ తర్వాత తదుపరి వివరాలను వెల్లడిస్తామని చెప్పారు.

మొబైల్ ఫోన్‌లో చాటింగ్‌ ఆధారంగా విచారణ జరిపితే.. ఉమ్మడి మహబూబ్ నగర్‌ జిల్లాలోని కోస్గికి చెందిన శివరామ్‌ రాథోడ్ అనే వ్యక్తితో చాటింగ్ చేసినట్టుగా తేలిందని చెప్పారు. అలాగే బాలాజీ దర్శన్ హోటల్‌లో శుక్రవారం ఉదయం 11 గంటలకు ప్రవళిక, శివరామ్ కలిసి టిఫిన్ చేసినట్టుగా సీసీటీవీ ఫుటేజ్‌ లభించిందని తెలిపారు. అయితే చాటింగ్‌ను పరిశీలిస్తే.. ప్రవళికను చీట్ చేసి శివరామ్ వేరే అమ్మాయితో ఎంగేజ్‌మెంట్ కుదుర్చుకునేందుకు చూశాడని.. అందుకే ప్రవళిక మనస్తాపం చెందిందని తెలుస్తోందని చెప్పారు.

ప్రవళిక తల్లిదండ్రులు మర్రి లింగయ్య- విజయలకు కూడా ఆమె ప్రేమ విషయం తెలుసునని.. గతంలో ఒకసారి వార్నింగ్ కూడా ఇవ్వడం జరిగిందని తెలిపారు. ప్రస్తుతంఅనుమానస్పద మృతిగా ఇప్పుడు కేసు నమోదు చేశామని.. డేటా రిట్రీవ్ అయిన తర్వాత లీగల్ ఓపినియన్ తీసుకుని 306 కిందకు కేసును మార్చనున్నట్టుగా చెప్పారు. అయితే దీని వెనక ఏ ఇతర కారణాలు కనిపించడం లేదనిఅన్నారు. గ్రూప్స్ పరీక్ష కోసం ప్రిపేర్ అయ్యేందుకు వచ్చిందని.. ఇప్పటివరకు ఎలాంటి పరీక్ష రాయలేదని చెప్పారు. సూసైడ్ నోట్ చూస్తే క్లియర్‌గా తెలుస్తోందని.. వాళ్ల అమ్మను క్షమించమని కోరిందని, జాగ్రత్తగా చూసుకోమని తమ్ముడికి చెప్పిందని తెలిపారు.

ప్రవళిలక పర్సనల్ విషయంలోనే ఆత్మహత్య చేసుకుందని ఆమె రూమ్‌మెట్స్ కూడా చెప్పారని తెలిపారు. రాత్రి కూడా ప్రవళిక రూమ్‌మెట్ శృతి ఇదే విషయాన్ని చెప్పినప్పటికీ ఎవరూ పట్టించుకోలేదని అన్నారు. శివరామ్ ఆచూకీ ఇంకా లభించలేదని తెలిపారు. అన్ని ఆధారాలు లభించిన తర్వాత శివరామ్‌పై న్యాయపరంగా చర్యలు తీసుకుంటామని తెలిపారు. నిన్న ఆందోళన చేసిన వారిపై చట్టపరంగా చర్యలు తీసుకోనున్నట్టుగా చెప్పారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Trending

Exit mobile version